Monday, 21 September 2026

వన్ ఫ్యామిలీ – వన్ ఆంత్రప్రెన్యూర్’ లక్ష్యం : CM

వన్ ఫ్యామిలీ – వన్ ఆంత్రప్రెన్యూర్’ లక్ష్యం

- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 


కుప్పం ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకుని, పర్యాటక మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల విస్తరణపై ఇన్వెస్టర్లు, భాగస్వాములతో ముఖ్యమంత్రి  ముఖాముఖి నిర్వహించి పలు సూచనలు చేశారు.

కుప్పం, సెప్టెంబర్ 21

వన్ ఫ్యామిలీ – వన్ ఆంత్రప్రెన్యూర్’ లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యువతలో స్టార్టప్ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్నారు . ప్రాంతంలో టూరిజం, అడ్వెంచర్ టూరిజం రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయాలని తెలిపారు. స్థానికంగా ఏయే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చు, వాటికి అవసరమైన సాంకేతికత ఏమిటి అనే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. స్థానిక అవసరాలు, యువత నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి స్టార్టప్‌లు ఏర్పాటు చేయవచ్చో గుర్తించాలని తెలిపారు.

యువతకు నిరంతర మార్గదర్శకత్వం అందించేందుకు స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా యువతకు వ్యాపార ఆలోచనలు, సాంకేతికత, నిర్వహణ, స్టార్టప్ అభివృద్ధిపై నిరంతర మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. యువతకు మూడు నెలల పాటు శిక్షణ, మార్గదర్శకత్వం అందించే విధంగా ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం ‘వన్ ఫ్యామిలీ – వన్ ఆంత్రప్రెన్యూర్’ అని, ఇందులో యువతను ఎక్కువగా భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు. 7వ తరగతి నుంచే విద్యార్థులకు ఆంత్రప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలను పాఠ్యాంశంలో భాగంగా పరిచయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

విద్య పూర్తయ్యే సమయానికి ప్రతి విద్యార్థి ఒక స్టార్టప్ ఆలోచనతో బయటకు వచ్చేలా స్టార్టప్ సంస్కృతిని పాఠశాల స్థాయి నుంచే పెంపొందించాలన్నారు. యువతలో సృజనాత్మకత, వ్యాపార దృక్పథం, నూతన ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెంచేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి యువతకు ఉపాధి కోరుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగే అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.


No comments:

Post a Comment