*వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి*
వినాయక మండపాల ఏర్పాటుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 13వ తేదీలోగా RDO కార్యాలయంలో సమర్పించాలి
- చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు
చిత్తూరు, సెప్టెంబర్ 7: ఫస్ట్ న్యూస్ 4 యు
వినాయక చవితి ఉత్సవాలు మరియు వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డీఎస్పీ వెంకట నారాయణ, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, వినాయక ఉత్సవ కమిటీ కన్వీనర్ అట్లూరి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, వినాయక మండపాల ఏర్పాటుకు ప్రతిసారి ప్రతి శాఖ నుంచి విడివిడిగా అనుమతులు తీసుకునే అవసరం లేకుండా ప్రభుత్వం సింగిల్ విండో ఆన్‌లైన్ పర్మిషన్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వినాయక మండపాల వద్ద పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, పారిశుద్ధ్యం, మున్సిపల్ తదితర లైన్ డిపార్ట్‌మెంట్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మండపాల వద్ద భారీ కేడ్లు ఏర్పాటు చేసి రహదారులను పూర్తిగా మూసివేయకుండా చూడాలని, ద్విచక్ర వాహనదారులు, ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆర్డీవో సూచించారు.
డీఎస్పీ మాట్లాడుతూ, వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు, కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ప్రతి వినాయక మండపం వద్ద భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులను బాధ్యతగా నియమించుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు మండపాల వద్ద భద్రతా చర్యలను పరిశీలించి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద మహిళలు, చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే డీజేలు, అధిక శబ్దంతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండి, ఉత్సవాలను భక్తిభావంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలని కోరారు. నిమజ్జన సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద పరిమాణంలో విగ్రహాలను ఏర్పాటు చేయకుండా, మట్టి మరియు పర్యావరణహిత వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.
వినాయక మండపాల ఏర్పాటుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 13వ తేదీలోగా సమర్పించాలని, వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 24వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం నీటి సమస్యలు ఉన్నందున నీటి వనరులకు ఇబ్బందులు కలగకుండా, పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు.
వినాయక చవితి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.


No comments:
Post a Comment