Wednesday, 30 September 2026

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ తనిఖీ – మద్యం వ్యసన బాధితులకు కౌన్సెలింగ్

*చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ తనిఖీ – మద్యం వ్యసన బాధితులకు కౌన్సెలింగ్*

*“ఆపరేషన్ గరుడ”లో భాగంగా మెడికల్ షాపులలో నార్కోటిక్ డ్రగ్స్ విక్రయాలపై తనిఖీలు*


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

చిత్తూరు జిల్లా ఎస్పీ  తుషార్ డూడి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఆపరేషన్ గరుడలో భాగంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో పోలీసు అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మరియు ఈగల్ టీం సభ్యులు సంయుక్తంగా తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.


ఈ సందర్భంగా చిత్తూరు ఎస్‌బీ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రవీణ్ , ఈగల్ టీం సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు. సెంటర్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, చికిత్సకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.


అక్కడ చికిత్స పొందుతున్న ఏడుగురు మద్యం వ్యసన బాధితులతో ఎస్‌బీ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడి, మద్యం మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్ప్రభావాలను వివరించారు. వ్యసనానికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు.


మెడికల్ షాపుల్లో నార్కోటిక్ డ్రగ్స్‌పై తనిఖీలు



అనంతరం ఆపరేషన్ గరుడలో భాగంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతంలోని మెడికల్ షాపులలో చిత్తూరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్  వి. కీర్తన , చిత్తూరు ఎస్‌బీ ఇన్స్పెక్టర్  ప్రవీణ్ , చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య , ఈగల్ టీం సభ్యులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.


ఈ తనిఖీలలో నార్కోటిక్ డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు, నిల్వ, సరఫరా మరియు వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మెడికల్ షాపుల్లో నిర్వహిస్తున్న రికార్డులు, మందుల విక్రయాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నార్కోటిక్ డ్రగ్స్ విక్రయాలు జరగకుండా సంబంధిత నిర్వాహకులకు సూచనలు చేశారు.


నార్కోటిక్ డ్రగ్స్‌ను అక్రమంగా విక్రయించడం, కొనుగోలు చేయడం లేదా సరఫరా చేయడం చట్టపరంగా నేరమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలు, వినియోగం లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు లేదా ఎస్.బి. ఇన్స్పెక్టర్ నెంబర్ 9490617896 కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

No comments:

Post a Comment