Tuesday, 29 September 2026

రాయలసీమ హార్టికల్చర్ హబ్‌తో ఉద్యానరంగానికి సమగ్ర అభివృద్ధి


రాయలసీమ హార్టికల్చర్ హబ్‌తో ఉద్యానరంగానికి సమగ్ర అభివృద్ధి

చిత్తూరు జిల్లాకు రూ.1,529.69 కోట్ల విలువైన ప్రతిపాదనలు

రైతులకు ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సమగ్ర విలువ ఆధారిత శ్రేణి

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్




చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు, సెప్టెంబర్ 29: 

రాయలసీమ ప్రాంతంలో ఉద్యానరంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చిత్తూరు జిల్లాకు రూ.1,529.69 కోట్ల విలువైన ప్రతిపాదనలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ మరియు సహకార (H&S) శాఖ జారీ చేసిన G.O.Rt.No.416, తేదీ 19-05-2026 ప్రకారం ఈ సమగ్ర ప్రణాళికను ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. 2026 అక్టోబర్ 2న మదనపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రణాళిక ద్వారా ఉద్యానవన రంగం, సాగునీరు, మౌలిక వసతులు, గ్రామీణ అభివృద్ధి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 20 క్లస్టర్లు, 27 మండలాల్లో మూడు సంవత్సరాల పాటు మూడు దశల్లో కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు వివరించారు.

మొదటి దశలో 2026-27లో 5 క్లస్టర్లు, 7 మండలాలు; రెండో దశలో 2027-28లో 8 క్లస్టర్లు, 9 మండలాలు; మూడో దశలో 2028-29లో 7 క్లస్టర్లు, 11 మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.


ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సమగ్ర విలువ ఆధారిత శ్రేణి

రైతులకు కేవలం పంట ఉత్పత్తి వరకు మాత్రమే కాకుండా, ఉత్పత్తి, నాణ్యత పెంపు, పంట అనంతర నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులు వరకు పూర్తి స్థాయి విలువ ఆధారిత శ్రేణిని అభివృద్ధి చేయడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.


ప్రధాన కార్యక్రమాలు

* సూక్ష్మ సాగునీటి పద్ధతులు – రూ.620.40 కోట్లు: రైతులకు సూక్ష్మ సాగునీటి సదుపాయాలను విస్తృతంగా అందించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం.

* డిమాండ్ ఆధారిత పంటలు – రూ.383.74 కోట్లు: మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విదేశీ, ప్రత్యేక రకాల పండ్లు, కూరగాయలు, పుష్పాలు, ఆయిల్‌పామ్ వంటి పంటలను ప్రోత్సహించడం.

* ఉత్పాదకత పెంపు – రూ.162.80 కోట్లు: పాత తోటల పునరుద్ధరణ, కొమ్మల కత్తిరింపు, తోటల నిర్వహణ, మల్చింగ్, సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం.

* GAP/నాణ్యత మెరుగుదల – రూ.28.85 కోట్లు: మంచి వ్యవసాయ పద్ధతులు, పంట సంరక్షణ, ట్రేసబిలిటీ, ధృవీకరణ వంటి చర్యలను ప్రోత్సహించడం.

* మార్కెట్ మౌలిక వసతులు – రూ.77.11 కోట్లు: సేకరణ కేంద్రాలు, గిడ్డంగులు, సార్టింగ్ కేంద్రాలు, ప్యాక్‌హౌస్‌లు, డిజిటల్ ప్రదర్శన బోర్డులు, గ్రేడింగ్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేయడం.

* పంట అనంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తులు – రూ.84.96 కోట్లు: ప్యాక్‌హౌస్‌లు, ప్రీ-కూలింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు, రైపెనింగ్ చాంబర్లు, రిఫ్రిజిరేటెడ్ రవాణా, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు.

* స్టార్టప్‌ల అభివృద్ధి – రూ.23 కోట్లు: రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) బలోపేతం, మార్కెటింగ్, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, డిజిటల్ మార్కెట్ల అభివృద్ధికి ప్రోత్సాహం.

* నాణ్యమైన మొక్కల సరఫరా – రూ.21 కోట్లు: నాణ్యమైన నర్సరీలు, వ్యాధి రహిత నాట్ల పదార్థం, నర్సరీల ధృవీకరణకు ప్రాధాన్యం.

* వ్యవసాయ యాంత్రీకరణ – రూ.17.21 కోట్లు: ఉద్యాన వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం.

* అవగాహన, సామర్థ్య నిర్మాణం – రూ.17.40 కోట్లు: రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించడం.

* సాంకేతిక విస్తరణ, FLDs – రూ.16.13 కోట్లు: సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ, ఫ్రంట్‌లైన్ డెమాన్‌స్ట్రేషన్స్ (FLDs) తదితర కార్యక్రమాల అమలు.

* ఇతర క్లస్టర్ ఆధారిత కార్యక్రమాలు – రూ.67.09 కోట్లు: ఆయా క్లస్టర్ల అవసరాలకు అనుగుణంగా ఇతర సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.

రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా చిత్తూరు జిల్లాలో ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుతో పాటు పంట అనంతర నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ తెలిపారు.

ఈ సమగ్ర ప్రణాళిక ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం, ఉద్యాన పంటలకు విలువను పెంచడం, రైతుల ఆదాయ అవకాశాలను మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.


No comments:

Post a Comment