Tuesday, 22 September 2026

మీ ఎర్రచందనం కేసులు, మీ అక్రమ వ్యాపారాలు గురించి ప్రజలకు తెలియదా..!

2019-24 మధ్య చిత్తూరులో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై విచారణ..


* అభివృద్ధిని చూసి ఓర్వలేకే.. పీఏపై, నాపై విమర్శల హడావిడి..

* మీ ఎర్రచందనం కేసులు, మీ అక్రమ వ్యాపారాలు గురించి ప్రజలకు తెలియదా..!

* నేను ఒక్క క్వారీ చేసి సంపాదించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మీరు రాజకీయం వదిలేస్తారా..

* ఒక స్మగ్లర్, లిక్కర్ స్కాం నిందితులకు వైకాపాలో ఎలా సీట్ ఇచ్చారో..?

* నాన్న మాట కోసం, ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చా..

* విలేకరుల సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 


విజయాలే లేని విజయానంద రెడ్డి.. జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని ఏదో హడావిడి చేసి.. సొంత మీడియాలో, ఆయన సోషల్ మీడియాలో అసత్య పోస్టులు చేస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ విమర్శించారు. చిత్తూరు ఎమ్మెల్యే పిఏ అక్రమంగా క్వారీలు చేసి కోట్లు సంపాదిస్తున్నట్లు వీడియోలు చేసి పోస్టులు చేయడంపై ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఘాటుగా బదులిచ్చారు. అసలు క్వారీ ఎవరిది ? ఓనర్ ఎవరు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం ఒక రాజకీయ నాయకుడిగా తగదన్నారు.  ఒక బీసీ ఉద్యోగి పీఏ గా ఉండడం జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మీ చరిత్ర ఏమిటో? ఎర్రచందనం కేసులు ఎన్నో? మీ సంపాదన ఎలా వచ్చిందో ప్రజలకు తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టే.. తీవ్రమైన కేసులు ఉన్నా.. కక్ష సాధింపులకు దిగలేదని.. రాజకీయాలే చేయాలనుకుంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్నారు. 14 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన వ్యక్తి మీరు కాదా అని ప్రశ్నించారు.

తాను ఎప్పుడూ వ్యక్తిగత దూషణలు చేయలేదని.. ఒక మంచి ఆశయం కోసం, నాన్నకు ఇచ్చిన మాట కోసం, చిత్తూరును అభివృద్ధి చేయాలని సంకల్పంతో రాజకీయాలకు వచ్చానని, ప్రజలు నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే దిశగా చిత్తూరులో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్న వ్యక్తిని.. నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన పార్టీ ఎలాంటిదో చిత్తూరు ప్రజలు గుర్తించాలన్నారు. రాజకీయపరంగా నా ఎదుగుదలను చూసి ఓర్వలేకే.. నా పైనా, పిఏ పైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత వైకాపా ప్రభుత్వం 2019-24 మధ్య చిత్తూరు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాల్లో జరిగిన అక్రమ క్వారీలు, అక్రమ వసూళ్లు, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ చేసి ముఖ్యమంత్రి గారికి సమర్పించాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతున్నట్లు చెప్పారు. సాక్షాత్తు ఏడుకొండలవాడు కొలువైన శేషాచలం కొండల్లో సంపదనంతా దోచుకొని ప్రస్తుతం ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా ఒక్క క్వారీని నిర్వహించి డబ్బు సంపాదించినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని.. మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని సవాల్ చేశారు. మీరు చే‌సిన ఆరోపణలపై మా పీఏ కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని.. మీ ఎర్రచందనం కేసులపై ప్రమాణానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు మంచి చేయాలని, చిత్తూరు ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్న సందర్భంలో.. అనవసరంగా రాజకీయాలు చేస్తూ.. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. డ్రామాలు ఆడడం నిజమైన రాజకీయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, తెదేపా నగర అధ్యక్షుడు వరుణ్ కుమార్, వెంకటేష్ యాదవ్, నీరజాక్షలు, చిట్టిబాబు, లీలావతి తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment