Wednesday, 23 September 2026

వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా

వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా.



*యాదమరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో నమోదైన వరకట్న వేధింపులు, వివాహిత మహిళపై వేధింపులకు సంబంధించిన కేసులో నిందితుడైన A-1 ఆర్. సతీష్‌కు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా విధిస్తూ గౌరవ VI అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం జడ్జ్ శ్రీమతి టి.హరిత గారు తీర్పు వెలువరించారు.*


*కేసు వివరాలు:*


01-06-2014న కాట్పాడికి చెందిన కలైవాణికి యాదమరి మండలం రామభద్రాపురం గ్రామానికి చెందిన ఆర్.సతీష్‌తో చిత్తూరులో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది. వివాహ సమయంలో నిందితుడి కోరిక మేరకు 20 సవర్ల బంగారు ఆభరణాలు మరియు సుమో వాహనం కొనుగోలు కోసం రూ.1,80,000/- కట్నంగా ఇచ్చారు.


వివాహం జరిగిన మూడు నెలల తరువాత నిందితుడు అదనంగా రూ.15,000/- డిమాండ్ చేయగా, ఆ మొత్తాన్ని కూడా కుటుంబ సభ్యులు సమకూర్చారు. అనంతరం 17-12-2014న అదనంగా రూ.50,000/- వరకట్నం తీసుకురావాలని నిందితుడు కలైవాణిని కోరినట్లు, ఈ విషయమై ఆమె తల్లిదండ్రులు నిందితుడికి నచ్చజెప్పి కోరిన డబ్బును ఇస్తామని తెలిపారు.


నిందితుడు మద్యం సేవించి కలైవాణిని తరచూ వేధిస్తూ, ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవపడేవాడని, కుటుంబ సభ్యులు మరియు పెద్దలు పలుమార్లు నిందితుడికి నచ్చజెప్పినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని కేసు దర్యాప్తులో వెల్లడైంది.


08-01-2015న సాయంత్రం సుమారు 4.30 గంటలకు నిందితుడు R. సతీష్, కలైవాణి ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అనంతరం ఆమె మృతి చెందినట్లు మరోసారి సమాచారం ఇవ్వడంతో, కలైవాణి తల్లి శ్రీమతి ఎస్. లక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా, కలైవాణి మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు.


శ్రీమతి ఎస్. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాదమరి పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఎస్‌.ఐ శ్రీ సి. వెంకటేష్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి చిత్తూరు SDPO శ్రీ యం. లక్ష్మీ నాయుడు గారు దర్యాప్తు చేపట్టి, మృతదేహంపై ఇన్‌క్వెస్ట్ నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్లాస్టిక్ తాడు తదితర నేరానికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


13-01-2015న నిందితుడు R. సతీష్‌ను రామభద్రాపురం గ్రామం సమీపంలోని తిరుపతి–బెంగళూరు బైపాస్ రోడ్డులో అరెస్ట్ చేసి, గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై గౌరవ న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.


కేసు విచారణ అనంతరం 23-09-2026న గౌరవ VI అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడు U/Sec. 498-A IPC కింద నేరస్థుడిగా నిర్ధారించబడి, Cr.P.C. 235(2) ప్రకారం దోషిగా నిర్ధారించారు. ఆయనకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.


అదే సమయంలో నిందితుడిపై ఉన్న U/Sec. 302, 201, 304-B IPC మరియు Dowry Prohibition Act, 1961లోని Sections 3 & 4 అభియోగాలు రుజువు కాకపోవడంతో, Cr.P.C. 235(1) ప్రకారం ఆయా అభియోగాల నుంచి నిందితుడిని నిర్దోషిగా విడుదల చేశారు.


కేసును నమోదు చేసి సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి, సాక్ష్యాధారాలను సేకరించి గౌరవ న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన అప్పటి యాదమరి పోలీస్ స్టేషన్ ఎస్‌.ఐ శ్రీ C. వెంకటేష్ గారితో పాటు, కేసు దర్యాప్తును పర్యవేక్షించిన అప్పటి చిత్తూరు SDPO శ్రీ M. లక్ష్మీ నాయుడు గారిని, కేసు విచారణను నిరంతరం పర్యవేక్షించిన కోర్ట్ మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ S.K. ఖాదర్ మొహిద్దీన్ (HC-2978) గారిని, కేసులో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన యాదమరి పోలీస్ స్టేషన్ PC-4096 శ్రీ సురేష్ గారిని కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీ మనోహర్ మరియు గౌరవ న్యాయస్థానంలో కేసును సమర్థవంతంగా వాదించిన Addl. PP శ్రీ M. బాలాజీ గార్లను జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు అభినందించారు.

No comments:

Post a Comment