Saturday, 26 September 2026

గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై రీల్‌/వీడియో పోటీ*

*గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై రీల్‌/వీడియో పోటీ* 

*వచ్చేనెల 2 వ తేదీ మదనపల్లె  ముఖ్యమంత్రి పర్యటనలో ఉత్తమ 5 వీడియోల ప్రదర్శన : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్* 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు, సెప్టెంబర్ 26: 

రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపడుతున్న “గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్ – రాయలసీమ విజయీభవ” కార్యక్రమంపై సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వీడియో మేకర్లు, విద్యార్థులు, ఇతర ఆసక్తి ఉన్నవారికి రీల్‌/వీడియో పోటీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.


రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను భారతదేశపు గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేసే విధానాన్ని సృజనాత్మకంగా, వినూత్నంగా ప్రజలకు వివరించేలా వీడియోలను రూపొందించాలని కలెక్టర్‌ సూచించారు. ఒక జిల్లా లేదా ఒక ఉద్యాన ఉత్పత్తిని ప్రధాన అంశంగా తీసుకుని కూడా వీడియో రూపొందించవచ్చని తెలిపారు.


60 నుంచి 90 సెకన్ల వ్యవధి కలిగిన రీల్‌/వీడియోలను సెప్టెంబర్‌ 26 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వివిధ సామాజిక మాధ్యమ వేదికల్లో పోస్ట్‌ చేయాలని సూచించారు. ఎంపికైన ఉత్తమ 5 వీడియోలను మదనపల్లెలో వచ్చే నెల 2వ తేదీ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 50 వేల మంది ప్రజల సమక్షంలో జరిగే ప్రధాన కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.


ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ కూడా వీడియోలను తిలకించనున్నట్లు తెలిపారు. ఎంపికైన విజేతలను ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు.


సెప్టెంబర్‌ 30వ తేదీ ముగిసేలోగా విజేతలను ఖరారు చేసి, అక్టోబర్‌ 1వ తేదీన వారికి సమాచారం అందించనున్నట్లు తెలిపారు.


వీడియోలో ఉపయోగించాల్సిన హ్యాష్‌ట్యాగ్‌లు


#RayalaseemaVijayeebhava

#RayalaseemaRising

#GlobalHorticultureHub

#PrapanchaUdhyanaKendram

#APOfficialNews


రీల్‌/వీడియోలను పోస్ట్‌ చేసే సమయంలో APDC అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా @APOfficialNewsను ట్యాగ్‌ చేయడం, కొలాబరేట్‌ చేయడం లేదా మెన్షన్‌ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


రాయలసీమలో ఉద్యాన పంటల విస్తరణ, సూక్ష్మ నీటిపారుదల, రైతులకు మార్కెట్‌ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్‌, కోల్డ్‌చైన్‌, ఎగుమతులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను సృజనాత్మకంగా ప్రజలకు చేరువ చేసేలా వీడియోలను రూపొందించాలని  కోరారు.



No comments:

Post a Comment