Friday, 25 September 2026

నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు

నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రలు

*కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ*



*చిత్తూరు, ఫస్ట్ న్యూస్ 4 యు సెప్టెంబర్ 25:

* జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని స్థానిక  గవర్నమెంట్ హైస్కూల్ లో జిల్లా లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు. పిల్లలచేత ఆల్బెండజోల్ మాత్రలను మ్రింగించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా అల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

నులిపురుగుల కారణంగా రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. వీటి నివారణకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అల్బెండజోల్ మాత్రను తీసుకోవాలని సూచించారు. 

డిఎంఅండ్హెచ్ఓ శశిభూషణం రెడ్డి మాట్లాడుతూ... ఆల్బెండజోల్ మాత్రల వినియోగం వల్ల రక్తహీనతను నివారించడంతో పాటు పోషకాల గ్రహణశక్తి మెరుగుపడుతుందని, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుందని వివరించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు గల 63,963 మంది బాలబాలికలకు అర మాత్ర, 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు ఒక పూర్తి మాత్ర అందజేస్తున్నట్లు తెలిపారు. 

అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 2,09,245 మంది విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంటర్మీడియట్ (ఐ టి ఐ, పాలిటెక్నిక్, వొకేషనల్, నర్సింగ్) విద్యార్థులకు కూడా ఈ మాత్రలను అందజేస్తున్నట్లు తెలిపారు.

నులిపురుగుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. గోళ్లను చిన్నవిగా, శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రమైన మంచినీటిని తాగడం, ఆహారాన్ని ఎప్పుడూ కప్పి ఉంచడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకుండా ఉండడం, బయట తిరిగేటప్పుడు తప్పనిసరిగా చెప్పులు ధరించడం, ఆహారం తినడానికి ముందు, తిన్న తరువాత, మల విసర్జన అనంతరం చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 3,10,910 మంది బాలబాలికలను గుర్తించామని, 2,102 అంగన్వాడీ కేంద్రాలు, 2,248 ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు. డిప్యూటీ డీఈవో, సిబ్బంది ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment