Friday, 25 September 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం – రావూరి వెంకటస్వామి

బీజేపీ బలోపేతానికి అంకితభావంతో పని చేస్తా

*స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం

– రావూరి వెంకటస్వామి


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు : 


“భారతీయ జనతా పార్టీ దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడిన పార్టీ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి, అలాగే అధికార కూటమి అభ్యర్థుల అపార విజయానికి నా వంతు శ్రమను, సహకారాన్ని అందిస్తాను” అని ప్రముఖ విద్యావేత్త, శ్రీనివాస ఎడ్యుకేషనల్ అకాడమీ అధినేత, సామాజిక వేత్త రావూరి వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇటీవల విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన అనంతరం, శుక్రవారం చిత్తూరులో రావూరి వెంకటస్వామి మొదటిసారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ విధానాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే స్థానిక ఎన్నికల వ్యూహంపై సమగ్రంగా మీడియాకు వివరించారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో నవభారత నిర్మాణం


విలేకరుల సమావేశంలో రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ – "నేడు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై సరికొత్త శకానికి నాంది పలికింది. వికసిత్ భారత్-2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఫలాలను అందిస్తున్నాయి. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా దేశంలోని లక్షలాది మంది రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతోంది. రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు, పీఎం ఫసల్ భీమా యోజన, రసాయన రహిత సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు నేడు అన్నదాతకు కొండంత అండగా నిలిచాయి. పీఎం ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేరడం, ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందడం, ఉజ్వల యోజన ద్వారా ప్రతి ఇంటికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కల్పించడం మోదీ ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనం."


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రావూరి వెంకటస్వామి కొనియాడారు. ‘‘రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులను మంజూరు చేస్తూ సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్ పనులు,  జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతమయ్యాయి. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, తిరుపతి, విజయవాడ, విశాఖ విమానాశ్రయాల ఆధునీకరణ ద్వారా రాష్ట్రం రవాణా రంగంలో సరికొత్త శిఖరాలను చేరుకుంటోంది. పారిశ్రామిక కారిడార్లు, సీపోర్టులు, తయారీ రంగం అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం వల్ల ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి’’ అని చెప్పారు. 


రాష్ట్రంలో పీవీఎన్ మాధవ్ క్రియాశీలక నాయకత్వం


బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతోందని రావూరి వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజాదరణ పొందిన నాయకుడిగా పీవీఎన్ మాధవ్ రాష్ట్రంలో పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. వారి దూరదృష్టి, వ్యూహాత్మక నాయకత్వం వల్ల నాలాంటి విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.



ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి విజయమే లక్ష్యం

గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని.. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ, బలమైన సంబంధాలు ఉన్నాయని రావూరి చెప్పారు. విద్యావేత్తగా, సమాజ సేవకుడిగా తనకున్న సుదీర్ఘ అనుభవం, ప్రజలతో ఉన్న పేగుబంధం రాబోయే ఎన్నికల్లో బీజేపీకి, కూటమి విజయానికి కృషి చేస్తామన్నారు. "ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులతో, సీనియర్ నాయకులతో కలిసికట్టుగా పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలపరుస్తాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి, కూటమి అభ్యర్థుల భారీ విజయానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్రజా సంక్షేమ పథకాలు, సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయి. కూటమి పాలన అందిస్తున్న ఈ సుపరిపాలనను ప్రజా బాహుళ్యంలోకి మరింత బలంగా తీసుకెళ్తాం. గత ప్రభుత్వంలో మూలపడిన వ్యవస్థలను బాగుచేస్తూ, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, సంక్షేమాన్ని-అభివృద్ధిని సమతుల్యం చేస్తూ కూటమి ప్రభుత్వం పయనిస్తోంది" అని కొనియాడారు.



కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు..


మునుపటి నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులను కలుపుకొని పోతూ చిత్తూరు జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూటమి జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామని రావూరి వెంకటస్వామి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై, పీవీఎన్ మాధవ్ గారి నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే తాను బీజేపీలోకి అడుగుపెట్టానని, పార్టీ ఇచ్చే ప్రతి బాధ్యతను క్రమశిక్షణతో నెరవేరుస్తానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో స్థానిక బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, రావూరి అనుచరులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment