ఈ నెల 28,29 తేదీలలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్, సభ్యుల చిత్తూరు జిల్లా పర్యటన :
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
*చిత్తూరు, ఫస్ట్ న్యూస్ 4 యు సెప్టెంబర్ 25:*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) గౌరవ చైర్పర్సన్ శ్రీ వెటుకూరి ఏ.వి.ఎస్. సూర్య నారాయణ రాజు, గౌరవ సభ్యురాలు శ్రీమతి కె.జి.వి. పద్మలత ఈ నెల 28, 29 తేదీలలో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం చిత్తూరు జిల్లాకు చేరుకున్న అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఐసీడీఎస్ కేంద్రాలు, కేజీబీవీలు, బాలల సంరక్షణ సంస్థలు (CCIs), ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలను సందర్శించి బాలలకు అందుతున్న సేవలు, మౌలిక వసతులు, రక్షణ చర్యలను పరిశీలించనున్నారు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చిత్తూరులో రాత్రి బస చేస్తారు.
ఈ నెల 29వ తేదీన ఉదయం చిత్తూరు కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో శాఖలవారీగా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మహిళా అభ్యుదయ మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఐసీడీఎస్, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, బాలసదనాలు, వన్ స్టాప్ సెంటర్, శక్తి నివాస్, బేటీ బచావో–బేటీ పడావో, పోషకాహార లోపం, బాల్య వివాహాల నిరోధం తదితర అంశాలపై సమీక్ష జరగనుంది.
అదేవిధంగా జువైనల్ జస్టిస్ బోర్డు ద్వారా జువైనల్ జస్టిస్ చట్టం–2015 అమలు, బాలల పరిహారం, పునరావాసం; ఆహార భద్రత; బాలల ఆరోగ్య సేవలు, PCPNDT చట్టం అమలు; RTE చట్టంలోని 12(1)(c) ప్రకారం ప్రవేశాలు; పాఠశాలల మౌలిక వసతులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు; ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా అమలు; పాఠశాల బస్సుల భద్రత, ఫిట్నెస్, పర్మిట్లు, ఇన్సూరెన్స్; KGBVల పనితీరు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
సాంఘిక సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా పిల్లలకు అందుతున్న సేవలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చర్యలు, గ్రామ/వార్డు స్థాయి బాల్య వివాహాల నిరోధక కమిటీల పనితీరు, బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు, బయోమెట్రిక్ వివరాల నవీకరణ వంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు. పోలీసు శాఖ పరిధిలో పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ చట్టం, బీఎన్ఎస్ చట్టాల అమలు, రవాణా శాఖ పరిధిలో పాఠశాల విద్యార్థుల రవాణా వాహనాల ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ అంశాలు, పాఠశాలలకు సురక్షిత తాగునీటి సరఫరా, అలాగే గ్రామ, వార్డు స్థాయిలో బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటు, పనితీరు తదితర అంశాలపై కూడా సమీక్షించనున్నారు. కమిషన్ చైర్పర్సన్, సభ్యుల పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.

No comments:
Post a Comment