*పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు – చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి
*నవంబర్ 1న పోలింగ్, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు – ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు.*
*ఎన్నికల విధుల్లో 1,500 మందికి పైగా పోలీసు సిబ్బంది – సున్నిత, అతి సున్నిత కేంద్రాల వద్ద అదనపు భద్రత.*
*ఎన్నికల అక్రమాలు, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు.*
-జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు నగరపాలక సంస్థతో పాటు పలమనేరు, కుప్పం, నగరి పురపాలక సంఘాలకు 01-11-2026న పోలింగ్, 03-11-2026న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
*నామినేషన్ల సమయంలో పటిష్ట భద్రత:*
- నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించామని ఎస్పీ గారు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద స్పెషల్ పార్టీ, ఆర్మ్‌డ్ రిజర్వ్, ఏపీఎస్పీ బలగాలతో సహా 1,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించామని, నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేశామని వివరించారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు 178 మందికి పోలీసు ఎస్కార్ట్ కల్పించామని తెలిపారు.
*ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు:*
- ఎన్నికలకు సంబంధించి అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసి, 49 మంది నిందితులను గుర్తించామని, కేసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పార్టీలు, హోదాలతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
*అల్లర్ల నివారణకు ముందస్తు చర్యలు:*
- *ఎన్నికల నేపథ్యంలో 457 భద్రతా ప్రొసీడింగ్స్ కేసుల్లో 1,434 మందిని బైండోవర్ చేశామని, BNSS సెక్షన్ 170 కింద ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు 174 నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేశామని ఎస్పీ గారు తెలిపారు. జిల్లాలోని 559 లైసెన్సు ఆయుధాల్లో 520 ఆయుధాలను పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయగా, బ్యాంకుల భద్రతకు సంబంధించిన 39 ఆయుధాలకు నిబంధనల ప్రకారం మినహాయింపు ఇచ్చామని వివరించారు. రౌడీషీటర్లు, గతంలో ఎన్నికల అల్లర్లకు పాల్పడిన వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు.*
- *అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పట్టణ ప్రాంతాల్లో 37 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలించే నగదు, మద్యం, ఇతర వస్తువులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.*
*పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు:*
- నాలుగు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ గారు వెల్లడించారు. పోలింగ్ రోజున ఆర్మ్‌డ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఇతర కేటాయించిన సిబ్బందితో సహా 1,500 మందికి పైగా పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. అతి సున్నిత, సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరిస్తామని, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు నిరంతరం గస్తీ నిర్వహిస్తాయని చెప్పారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.
*ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి:*
- పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార గడువు ముగుస్తుందని ఎస్పీ గారు తెలిపారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత బహిరంగ సభలు, ఊరేగింపులు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, గుంపులుగా ప్రచారం నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. సంబంధిత పురపాలక సంఘాల ఓటర్లు కాని రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రచార గడువు ముగిసిన వెంటనే ఆయా పట్టణాల పరిధిని విడిచి వెళ్లాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో అమలులో ఉన్న నిషేధాజ్ఞలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
*ఎన్నికల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు:*
- ఓటర్లకు నగదు, మద్యం, ఇతర ప్రలోభాలు పంపిణీ చేయడం, ఓటర్లను బెదిరించడం, దొంగ ఓట్లు వేయడం, బూత్ ఆక్రమణకు పాల్పడడం, ఆయుధాలు తీసుకెళ్లడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు లేదా రెచ్చగొట్టే సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టరీత్యా నేరాలని ఎస్పీ గారు హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై పార్టీలు, హోదాలతో సంబంధం లేకుండా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు రోజున పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిర్వహించరాదని తెలిపారు.
*ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి:*
చిత్తూరు నగరపాలక సంస్థతో పాటు పలమనేరు, కుప్పం, నగరి పురపాలక సంఘాల పరిధిలోని ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీసులకు, ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఎన్నికల సమయంలో బెదిరింపులు, ప్రలోభాలు లేదా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు ఎదురైతే జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ 9440900005 లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.