స్ట్రాంగ్ రూమ్‌లు , క్షేత్రస్థాయిలో సందర్శించాలి
ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సమన్యంతో పని చేయాలి
పోలింగ్ సిబ్బంది కేటాయింపు నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ వరకు పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి
జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
సమయపాలన, సమన్వయంతో ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు, అక్టోబర్ 28:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర అంశాలపై అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జడ్పీ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఆర్డీవోలతో, మున్సిపల్ కమిషనర్లతో, ఎన్నికల విధులలో పాల్గొన్న సూపర్వైజర్లతో, కౌంటింగ్ కేంద్రాలలో, రిసెప్షన్ సెంటర్లో, కౌంటింగ్ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన అంశాలపై సమీక్షించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ డిఆర్ఓ కే మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
పోలింగ్ అధికారులు (PO), సహాయ పోలింగ్ అధికారులు (APO), ఇతర పోలింగ్ అధికారులు (OPO) నిర్ణీత సమయానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకునేలా ముందుగానే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. విధులకు నియమితులైన సిబ్బంది ఉదయం 7.30 నుంచి 8 గంటలలోపు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఆలస్యంగా వచ్చే వారి కారణంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, తదుపరి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. విధులకు హాజరుకాని సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో రిజర్వ్ సిబ్బందిని వినియోగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈనెల 30, 31 తేదీ, నవంబర్ ఒకటో తేదీలలో మున్సిపల్ ఎన్నికలకు పారదర్శకంగా మీ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు
స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే సమయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు, ముందుగానే స్ట్రాంగ్ రూమ్ నేలపై సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల నంబర్లను స్పష్టంగా గుర్తించాలి. తద్వారా పోలైన బ్యాలెట్ బాక్సులను, వాటికి సంబంధించిన ఎన్నికల పత్రాలను నిర్దేశించిన ప్రదేశాల్లో సులభంగా, ఖచ్చితంగా ఉంచవచ్చు. అలాగే ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్ బాక్సులను క్రమబద్ధంగా తరలించడానికి వీలవుతుంది. స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా చిత్రీకరించిన వీడియో రికార్డింగ్‌లను భద్రంగా భద్రపరచాలి.
జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియలో ప్రత్యేక కౌంటర్లు, సాధారణ కౌంటర్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, పేపర్ సీల్స్, ఇతర ముఖ్యమైన ఎన్నికల సామగ్రిని సంబంధిత సిబ్బందికి సక్రమంగా అందజేసి, వాటి స్వీకరణకు అవసరమైన సంతకాలు తీసుకోవాలని తెలిపారు. కౌంటర్ల వారీగా బాధ్యతలు స్పష్టంగా కేటాయించి, ప్రతి వస్తువు నిర్ణీత సిబ్బందికి అందేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేసే ముందు వాటి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏవైనా లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని అక్కడికక్కడే నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి కేటాయించిన ఓటర్ల సంఖ్య, పోలింగ్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని తగిన సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు అందజేయాలని తెలిపారు. పంపిణీ చేసిన సామగ్రిని సంబంధిత పోలింగ్ సిబ్బంది సమక్షంలో సరిచూసుకొని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
డిఆర్ఓ మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు కార్యక్రమాలన్నీ ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ సిబ్బంది మధ్యాహ్నం 3 గంటలలోపు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా రవాణా ఏర్పాట్లను సమన్వయం చేసుకోవాలని సూచించారు. రిసెప్షన్ కేంద్రాల్లో సిబ్బంది రిపోర్టింగ్, సామగ్రి స్వీకరణ, వాహనాల కేటాయింపు, రూట్ అధికారుల సమన్వయం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని, సిబ్బంది కేటాయింపు నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు తరలింపు వరకు అన్ని దశల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు నగిరి అనుపమ, పలమనేర్ భవాని, చిత్తూరు శ్రీనివాసులు నాయుడు, మున్సిపల్ కమిషనర్ చిత్తూర్ నరసింహ ప్రసాద్, కుప్పం ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు


No comments:
Post a Comment