Tuesday, 13 October 2026

వాట్సాప్‌లో ‘NO/YES’ అని రిప్లై ఇచ్చే ముందు జాగ్రత్త.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి - జిల్లా ఎస్పీ తుషార్ డూడి

వాట్సాప్‌లో ‘NO/YES’ అని రిప్లై ఇచ్చే ముందు జాగ్రత్త.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి - జిల్లా ఎస్పీ  తుషార్ డూడి

▶️ *ఓటీపీ చెప్పకపోయినా, లింక్ క్లిక్ చేయకపోయినా సైబర్ మోసాల బారిన పడే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.*

▶️ *బ్యాంకు లావాదేవీల పేరుతో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దు.*

▶️ *అనుమానాస్పద సందేశాలకు స్పందించకుండా, అధికారిక బ్యాంకు యాప్ ద్వారా ఖాతా వివరాలను పరిశీలించండి.*

▶️ *సైబర్ మోసానికి గురైతే వెంటనే “1930” హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.*

-జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.


*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ...* 

- ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు రోజురోజుకూ కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని, ముఖ్యంగా బ్యాంకు ఖాతాల నుంచి నగదు డెబిట్ అయినట్లు నమ్మిస్తూ ప్రజల్లో ఆందోళన కలిగించి వారి నుంచి స్పందన రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వాట్సాప్ ద్వారా వచ్చే అనుమానాస్పద సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


- కొన్ని సందేశాల్లో మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు పేర్కొంటూ, ఆ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే ‘NO’ అని రిప్లై ఇవ్వాలని కోరవచ్చని, ఇలాంటి సందేశాలను చూసి ఆందోళనకు గురై వెంటనే స్పందించకుండా ముందుగా వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని ఎస్పీ గారు సూచించారు.


- కొన్ని సైబర్ మోసాల్లో సందేశాలు, అనుమానాస్పద ఫైళ్లు లేదా లింకుల ద్వారా మాల్‌వేర్‌ను మొబైల్ ఫోన్లలోకి చొప్పించేందుకు నేరగాళ్లు ప్రయత్నిస్తారని ఎస్పీ గారు హెచ్చరించారు. ఇటువంటి మాల్‌వేర్ పరికరంలో ఇన్‌స్టాల్ అయి పనిచేయడం ప్రారంభిస్తే, మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని తెలిపారు. తద్వారా బ్యాంకు ఖాతాల్లోని నగదును కోల్పోయే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


- కేవలం ‘NO’ అని రిప్లై ఇచ్చినంత మాత్రాన ఫోన్ హ్యాక్ అవుతుందని లేదా బ్యాంకు ఖాతాలోని నగదు ఖాళీ అవుతుందని నిర్ధారించే సాంకేతిక ఆధారాలు లేవని, అయినప్పటికీ అనుమానాస్పద సందేశాలు, ఫైళ్లు, లింకులు లేదా ఇతర అభ్యర్థనలకు స్పందించకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ గారు తెలిపారు. మాల్‌వేర్, నకిలీ యాప్‌లు, ఫిషింగ్ లింకులు, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకింగ్ వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.


*ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:*


1. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే బ్యాంకు లావాదేవీల సందేశాలకు ‘YES’ లేదా ‘NO’ అని తొందరపడి రిప్లై ఇవ్వవద్దు.

2. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. తెలియని ఫైళ్లు, APKలను డౌన్‌లోడ్ చేయడం లేదా ఇన్‌స్టాల్ చేయడం చేయవద్దు.

3. మీ ఖాతాలో నగదు డెబిట్ అయినట్లు సందేశం వస్తే, అధికారిక బ్యాంకు యాప్, వెబ్‌సైట్ లేదా బ్యాంకు అధికారిక కస్టమర్ కేర్ ద్వారా నిర్ధారించుకోండి.

4. ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, సీవీవీ వంటి బ్యాంకింగ్ రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు.

5. అనుమానాస్పద నంబర్‌ను బ్లాక్ చేసి, ఆ సందేశాన్ని వాట్సాప్‌లో రిపోర్ట్ చేయండి.

6. అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించి, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయండి.


*సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సందేశమైనా దాని నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని ఎస్పీ గారు సూచించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకుని తమ కష్టార్జిత సొమ్మును కాపాడుకోవాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.*

No comments:

Post a Comment