Tuesday, 20 October 2026

తవణంపల్లిలో స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశం

 తవణంపల్లిలో స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశం

నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలి: రిటర్నింగ్ అధికారి వెంకటరమణ


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

తవణంపల్లి, అక్టోబర్ 20 : తవణంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రిటర్నింగ్ అధికారి వెంకటరమణ, సహాయ రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ రెడ్డి, ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల మండల అధ్యక్షులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు,  నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 27వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. నామినేషన్ దాఖలు చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500,  ఓసీ అభ్యర్థులు రూ.3,000 చొప్పున రుసుము చెల్లించాలని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైకులు వినియోగించాలని, సంబంధిత అధికారుల అనుమతి పొందాలని తెలిపారు. ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచార వాహనాల వినియోగానికి పోలీసు, ఎన్నికల అధికారుల అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయానికి 100 మీటర్ల పరిధి లోపల ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రభుత్వ బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రి ఏర్పాటు చేయకూడదని పేర్కొన్నారు. కుల, మతాల ఆధారంగా ఓట్లు కోరడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ప్రార్థనా మందిరాల ప్రాంగణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై అవాస్తవ ఆరోపణలు చేయడం నిషేధమని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి సందేహాలు, ఫిర్యాదులు ఉంటే రిటర్నింగ్ అధికారి, ఎంపీడీవో లేదా తహసీల్దార్‌ను సంప్రదించాలని సూచించారు.  నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ఠ భద్రత పై ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు, పాటించాలని సూచించారు. నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల అవతల వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment