Saturday, 17 October 2026

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లకు రెండో విడత శిక్షణ

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లకు రెండో విడత శిక్షణ

 పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు సమర్థవంతంగా శిక్షణ అందించాలి

- జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్




చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 17: 

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ అధికారులు (POలు), సహాయ పోలింగ్ అధికారులు (APOలు)కు సమర్థవంతంగా శిక్షణ అందించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సూచించారు. 


శనివారం చిత్తూరు లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆధ్వర్యంలో ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించేలా  రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని  నిర్వహించారు. 


 జిల్లా ఎస్‌జీఎస్‌డబ్ల్యూ అధికారి రవికుమార్ మరియు ఏ ఎస్ ఓ సౌందర్ రాజన్ శిక్షణ అందించగా, ఉపాధ్యాయులు(మాస్టర్ ట్రైనర్లు) పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల నిర్వహణకు వేలాది మంది ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారుల సేవలు అవసరమవుతాయని తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉన్న సిబ్బందికి ఒకేసారి శిక్షణ ఇవ్వడం సాధ్యం కానందున, మండలాల వారీగా మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రతి శిక్షణ తరగతికి సుమారు 50 నుంచి 60 మంది సిబ్బందిని కేటాయించి, ప్రతి ఒక్కరికీ ఎన్నికల విధులపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు.


ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా నిబంధనలకు లోబడి జరిగే ప్రక్రియ అని, ప్రతి దశలోనూ ఎన్నికల చట్టాలు, నియమావళి, అధికారిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో చిన్న పొరపాటు జరిగినా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, మాస్టర్ ట్రైనర్లు తమకు అందించిన శిక్షణ సామగ్రిని పూర్తిగా అధ్యయనం చేసి, సందేహాలను నివృత్తి చేసుకున్న తర్వాతే క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.


గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ, ప్రతి ఎన్నికలోనూ నిబంధనలు, విధానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున తాజా మార్గదర్శకాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని తెలిపారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల విధులు, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన ప్రతి దశను మాస్టర్ ట్రైనర్లు స్పష్టంగా వివరించాలన్నారు. శిక్షణ సమయంలో సిబ్బంది అడిగే సందేహాలకు అధికారిక శిక్షణ సామగ్రి ఆధారంగా సమాధానాలు ఇవ్వాలని, ఊహాజనిత సమాచారంతో వివరణలు ఇవ్వకూడదని సూచించారు.


ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్లు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని  ఆదేశించారు. శిక్షణ తరగతులను ఆర్డీవోలు, తహసీల్దార్లు పర్యవేక్షిస్తారని, తాను కూడా మూడు మండలాల్లో శిక్షణ కార్యక్రమాలను సందర్శించి, శిక్షణ అందించే విధానాన్ని పరిశీలిస్తానని తెలిపారు. శిక్షణకు సంబంధించిన సందేహాలు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామని పేర్కొన్నారు.


ఎన్నికల నిర్వహణలో జిల్లా పనితీరు మాస్టర్ ట్రైనర్లు అందించే శిక్షణ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని  ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాన్ని వినియోగించి, ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఎన్నికల విధులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో, అంకితభావంతో పనిచేయాలని సూచించారు.


No comments:

Post a Comment