నగరంలో ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారుస్తాం
- ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు నగరంలో ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డు గా మారుస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం నగరంలో 6వ వార్డు పరిధిలో శాంతినగర్, విద్యానగర్ లో రూ.19.10లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు నగరాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. నగరంలో అన్ని వార్డులు పరిధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సీఎం గారు రూ.60 కోట్ల హ్యమ్ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. వీటితో పాటు కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ. 80 కోట్లు మంజూరు అయ్యాయని, డిఎంఎఫ్ ద్వారా రూ.30 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల అనంతరం 16వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అవుతాయని చెప్పారు. అన్ని నిధులను సద్వినియోగం చేసుకొని నగరంలో ప్రతి వీధి, రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారుస్తామన్నారు. ఇంతగా అభివృద్ధి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతుగా నిలవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులకు ఏకపక్షంగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కూటమి నాయకులు కాజూరు బాలాజీ, వెంకటేష్ యాదవ్, యువరాజుల నాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment