స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించిన జిల్లా పోలీసులు.
చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్స్పెక్టర్ మొహమ్మద్ హషం.
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాడ్జిలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, అక్రమ నగదు, మద్యం రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ హషం తన పరిధిలోని లాడ్జిలను తనిఖీ చేసి, అక్కడ బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జి నిర్వాహకులు ప్రతి ఒక్కరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా 2 టౌన్ ఇన్స్పెక్టర్ హషం మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, అక్రమ నగదు, మద్యం రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జి నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, బస చేసే వ్యక్తుల పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలను నమోదు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




No comments:
Post a Comment