రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి
ప్రమాద ప్రాంతాలను గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్
చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు
జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు, ముఖ్యంగా ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ చైర్మన్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ, ప్రమాదాల తీవ్రతను తగ్గించడం, జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాల మెరుగుదల తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్బంగా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ప్రాణాంతక ప్రమాదాలను మరింత తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 2025 జనవరి–ఆగస్టుతో పోలిస్తే 2026లో మొత్తం ప్రమాదాలు 462 నుంచి 425కు, 8% తగ్గగా, గాయపడిన వారి సంఖ్య 615 నుంచి 449కు, 27% తగ్గిందని తెలిపారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ముఖ్యంగా NH-69, NH-42, NH-140 మార్గాల్లో ప్రమాదాలకు కారణాలను గుర్తించి, బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్ పర్యవేక్షణ, వాహన తనిఖీలు, వేగ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయంతో రహదారి భద్రతా లోపాలను పరిష్కరించి, గోల్డెన్ అవర్‌లో ప్రమాద బాధితులకు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక ప్రమాదాలు జరుగుతున్న జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి ఎన్‌హెచ్–69 (బెంగళూరు–పలమనేరు–చిత్తూరు–చెన్నై), ఎన్‌హెచ్–140 (చిత్తూరు–తిరుపతి), ఎన్‌హెచ్–42 (కుప్పం–పలమనేరు) మార్గాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కలెక్టర్ సమీక్షించారు. ఆయా మార్గాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేఆదేశించారు. జాతీయ రహదారులపై లైటింగ్, భద్రతా చర్యలు పటిష్టం చేయాలి
జిల్లాలోని జాతీయ రహదారులపై అవసరమైన ప్రాంతాల్లో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. రహదారి పరిస్థితులు, సైన్‌బోర్డులు, హెచ్చరిక బోర్డులు తదితర అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని జాతీయ రహదారులపై సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు సమావేశంలో అధికారులు కలెక్టర్‌కు వివరించారు. తనిఖీల్లో గుర్తించిన రహదారి భద్రతా లోపాలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి ప్రాధాన్యత, గడువుతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని సంబంధిత ప్రాజెక్ట్ డైరెక్టర్లను కలెక్టర్ ఆదేశించారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను సమీక్షించిన కలెక్టర్, ప్రతి ప్రమాదానికి దారితీసిన కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించాలని సూచించారు. ఒకే ప్రాంతంలో పదేపదే ప్రమాదాలు జరుగుతున్నట్లయితే ఆ ప్రాంతాన్ని గుర్తించి, ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ఇంజినీరింగ్, ట్రాఫిక్ నియంత్రణ, అవగాహన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
PM-RAHAT అమలుపై సమీక్ష
రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సహాయం అందించే PM-RAHAT పథకం అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. ప్రమాద బాధితులకు సకాలంలో అవసరమైన అత్యవసర సహాయం అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్‌లోనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 104/108 అత్యవసర సేవల పనితీరుపై అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షించి, అవసరమైన చోట సేవలను మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల సూచనలపై స్పందించాలి.
రహదారి భద్రతకు సంబంధించి ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, సమస్యలు, సూచనలను పరిశీలించి, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించడం ప్రతి శాఖ బాధ్యతగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రహదారి భద్రతకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సుబ్బరాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, NHAI PD, జి వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి,EE శ్రీనివాసరావు,NHAI అధికారులు బి చందు, కార్తిక రెడ్డి, రవీందర్ రావు, ఆర్ అండ్ బి SE సురేష్ బాబు, ఆర్టిసి అధికారి పంచాయతీరాజ్ శాఖ , డి సి హెచ్ ఓ పద్మాంజలి ,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment