“డ్రగ్స్ వద్దు బ్రో” – విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు పలమనేరు డి.ఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో 9వ, 10వ తరగతి విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సును ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు, విద్యాభ్యాసం, భవిష్యత్తు మరియు కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. చెడు స్నేహాలు, ఆకర్షణలకు లోనై మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన అనర్థాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.
సమాజంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1972కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో SI ప్రసాద్, EAGLE టీమ్ ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment