రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా వసంత్ కుమార్
ఉపాధ్యాయ దినోత్సవం రోజు అవార్డుల ప్రధానం
ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అధ్యాపకులు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు :
చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీ వి. వసంత కుమార్ గారికి విద్యారంగంలో విశేష సేవలు, అకడమిక్ ఎక్సలెన్స్, విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ తెలిపారు.
శ్రీ వి. వసంత కుమార్ గారు బోటనీ జూనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1996లో స్కూల్ అసిస్టెంట్గా ప్రభుత్వ విద్యాశాఖలో సేవలను ప్రారంభించి, 2002లో జూనియర్ లెక్చరర్గా పదోన్నతి పొందారు. అప్పటి నుండి బోధనతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
విద్యార్థుల అకడమిక్ ప్రగతికి మార్గదర్శకత్వం, విద్యా ప్రమాణాల పర్యవేక్షణ, అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కెరీర్ గైడెన్స్ మెంటర్గా పనిచేస్తూ ఉన్నత విద్య, పోటీ పరీక్షలు మరియు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.
ఇంటర్మీడియట్ విద్యలో చిత్తూరు జిల్లాలో NEET సంస్కరణల అమలుకు సంబంధించి రిసోర్స్ పర్సన్గా పనిచేసి, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాగే బోర్డు విద్యా సంస్కరణలకు అనుగుణంగా విద్యార్థులు, అధ్యాపకులకు మార్గదర్శకత్వం అందిస్తూ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను సమర్థవంతంగా అమలు చేయడంలో కృషి చేశారు.
సామాజిక బాధ్యతలో భాగంగా ఈగల్ క్లబ్ సభ్యునిగా మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్గా సేవలందించారు. NSS ద్వారా వృక్షారోపణ కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్య మరియు సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు.
విద్యార్థుల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ మార్గదర్శకత్వం, సామాజిక సేవ మరియు విద్యా సంస్కరణల అమలులో ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

No comments:
Post a Comment