Thursday, 27 August 2026

గ్రామ మహిళ పరిరక్షణ కార్యదర్శులతో సమావేశం

*గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో (GMSK) జిల్లా అంతటా పోలీసులు సమీక్షా సమావేశం నిర్వహణ.*

చిత్తూరు జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మహబూబ్ బాషా   పర్యవేక్షణలో జిల్లా పోలీసులు ఈరోజు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో (GMSK) ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత మరియు సామాజిక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది.

*ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు:*

*మహిళలపై నేరాల నివారణ:* గ్రామ స్థాయిలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వేధింపులు లేదా గృహ హింస వంటి సంఘటనలు దృష్టికి వస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు.

*రోడ్డు భద్రత:* పెరిగిపోతున్న రహదారి ప్రమాదాల దృష్ట్యా, గ్రామీణ ప్రాంతాల్లో హెల్మెట్ ధరించడం మరియు మితిమీరిన వేగాన్ని నివారించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

*సైబర్ నేరాలు:* ఆన్‌లైన్ మోసాలు, ఓటిపి (OTP) షేరింగ్ మరియు గుర్తుతెలియని లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.

ప్రజాభిప్రాయం (Public Perception): పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా, ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు.

రానున్న ఎన్నికలు: రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలు, గొడవలు, వివాదాలు లేదా అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, సమస్యాత్మక అంశాలు లేదా వ్యక్తుల గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని GMSKలకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా మరియు పారదర్శకంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.


"గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు పోలీసులకు మరియు ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని, సమాజంలో నేర రహిత వాతావరణాన్ని నిర్మించడంలో మీ పాత్ర అత్యంత కీలకమని పోలీసులు తెలిపారు."


జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా కోరడమైనది.

No comments:

Post a Comment