బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు
పట్టణంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్పీ శ్రీ శ్రీనివాస రావు గారి ఆధ్వర్యంలో ఎస్.ఐ. శ్రీ సుబ్బా రెడ్డి గారు కార్మిక శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చిత్తూరు పట్టణము నందు నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్తూరు పట్టణంలోని షూ షాపులు, స్వీట్ షాపులు, హోటళ్లు, క్లాత్ షాపులు తదితర వ్యాపార సంస్థలను సందర్శించి, బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని నిర్వాహకులకు అవగాహన కల్పించారు. బాలలను పనిలో నియమించకుండా వారి విద్యాభ్యాసానికి, బాల్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. గారు మాట్లాడుతూ, ప్రతి బాలుడికి విద్య, ఆరోగ్యం, సురక్షితమైన బాల్యం పొందే హక్కు ఉందని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొన్నారు. బాల కార్మికులను గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
చైల్డ్ అండ్ అడోలెసెంట్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1986కు 2016లో చేసిన సవరణల ప్రకారం 14 సంవత్సరాల లోపు బాలలను పనిలో నియమించడం సాధారణంగా నిషేధించబడిందని, అలాగే 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కిశోరులను ప్రమాదకర వృత్తులు, ప్రక్రియల్లో నియమించడం నిషేధమని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ శాఖ, కార్మిక శాఖతో పాటు ప్రజలు, వ్యాపార సంస్థల నిర్వాహకులు కూడా సహకరించాలని ఎస్.ఐ. విజ్ఞప్తి చేశారు. బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు కార్మిక శాఖ వారు పాల్గొన్నారు.




No comments:
Post a Comment