చంద్రగిరి లో కాళికాదేవి విగ్రహం లభ్యం
చంద్రగిరి బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పురాతన కాళికాదేవి విగ్రహం లభ్యమవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పంచలోహాలతో తయారైనట్లు కనిపిస్తున్న ఉగ్రరూపంలోని కాళికాదేవి విగ్రహం కోనేరులో బయటపడినట్లు చంద్రగిరి టీడీపీ సీనియర్ నాయకులు గౌస్ బాషా, రమేష్ రెడ్డి తెలిపారు.
బ్రహ్మంగారి ఆలయ సమీపంలోని కోనేరు మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, గురువారం ఉదయం పనులు చేస్తున్న సిబ్బంది కోనేరులో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలను తొలగిస్తుండగా విగ్రహం బయటపడినట్లు పేర్కొన్నారు.
విగ్రహం లభ్యమైన విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు.
విగ్రహం పురాతనమైనదా? పంచలోహాలతోనే తయారైందా? దాని చారిత్రక ప్రాధాన్యత ఏమిటనే విషయాలను సంబంధిత పురావస్తు, దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించాల్సి ఉంది.
కోనేరు వద్ద విగ్రహం బయటపడిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆసక్తిగా పరిశీలించారు.
ఇంతటి ఉగ్రరూపంలో ఉన్న పురాతన విగ్రహాన్ని ఇంతకుముందు తాము ప్రత్యక్షంగా చూడలేదని పలువురు స్థానికులు తెలిపారు.విగ్రహం లభ్యమైన నేపథ్యంలో అధికారులు వెంటనే ప్రదేశాన్ని పరిశీలించి, విగ్రహం చారిత్రక నేపథ్యం, నిర్మాణ కాలం తదితర వివరాలను అధికారికంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.


No comments:
Post a Comment