చిత్తూరు జిల్లాకు 60 మంది మహిళలకు విదేశీ ఉపాధి అవకాశం
ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ VV హరీష్ కోలా
చిత్తూరు, ఆగస్టు 29:
జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ మహిళలకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ద్వారా ఇజ్రాయెల్ దేశంలో హోమ్ బేస్డ్ కేర్‌గివర్ (ఇంటి ఆధారిత సంరక్షకురాలు) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్, చిత్తూరు కార్యనిర్వాహక సంచాలకులు VV హరీష్ కోలా శనివారం ఓ ప్రకటనలోతెలిపారు.
ఈ నియామకాల ద్వారా చిత్తూరు జిల్లాకు 60 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని, ఈ అవకాశాలు మహిళలకు మాత్రమే ఉద్దేశించబడినవని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులకు NSDC ఆధ్వర్యంలో అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
అర్హతలు:
దరఖాస్తుదారుల వయస్సు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీస ఎత్తు 1.5 మీటర్లు, బరువు 45 కిలోలు ఉండాలి. CEFR-B2 స్థాయి ఆంగ్ల భాషా పరిజ్ఞానం తప్పనిసరి. భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి OJTతో సహా 990 గంటల కేర్‌గివింగ్ కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే GDA, ANM, GNM, B.Sc. Nursing, Post B.Sc. Nursing అర్హతలు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం మూడు సంవత్సరాల గడువు ఉన్న పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. అభ్యర్థులు గతంలో ఇజ్రాయెల్‌లో పనిచేసి ఉండకూడదు. వారి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివసిస్తూ లేదా పనిచేస్తూ ఉండకూడదు.
PCC, వైద్య పరీక్షలు తప్పనిసరి:
అభ్యర్థులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) సమర్పించాలి. అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేసి, ఇజ్రాయెల్ వీసా నిబంధనల ప్రకారం మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలి.
వేతనం, ఇతర సౌకర్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు 6,443.85 NIS స్థూల వేతనం లభిస్తుంది. ఇది సుమారు 2,104.95 అమెరికన్ డాలర్లు లేదా ప్రస్తుత మారకపు విలువ ప్రకారం రూ.1,99,770/- వరకు ఉంటుంది. అదనంగా యజమాని ద్వారా వైద్య బీమా, వసతి, ఆహార సౌకర్యాలు కల్పించబడతాయి. వారానికి ఆరు పని దినాలు ఉంటాయి. ఉద్యోగ ఒప్పందం రెండు సంవత్సరాల కాలపరిమితితో ఉండి, తదుపరి పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు భరించాల్సిన ఖర్చులు:
- NSDC రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు – NSDC నుంచి కాంట్రాక్ట్ లెటర్ వచ్చిన తర్వాత చెల్లించాలి.
- మెడికల్ పరీక్ష ఫీజు – ఇంటర్వ్యూకు ముందు సంబంధిత మెడికల్ సెంటర్‌లో చెల్లించాలి.
- పోలీస్ వెరిఫికేషన్ ఫీజు – ఇంటర్వ్యూకు ముందు సంబంధిత శాఖకు చెల్లించాలి.
- పాస్‌పోర్ట్ ఫీజు – ఇంటర్వ్యూకు ముందు చెల్లించాలి.
- వీసా ఫీజు – ఇజ్రాయెల్ వీసా సెంటర్‌కు అభ్యర్థి చెల్లించాలి.
- విమాన ప్రయాణ ఖర్చు – వీసా వచ్చిన తర్వాత ఒకవైపు టికెట్ మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలి.
- వీడియో ఇంటర్వ్యూ ఫీజు – వీడియో ఇంటర్వ్యూకు ముందు NSDCకి చెల్లించాలి.
- ఇజ్రాయెల్ ప్లేస్‌మెంట్ బ్యూరో సేవల ఫీజు – విడతల వారీగా చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు APSCCFC అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవడంతో పాటు, జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంఘం లిమిటెడ్, చిత్తూరు కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వాహక సంచాలకులు కోరారు.
అదనపు వివరాల కోసం కార్యాలయ పనిదినాల్లో జిల్లా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
సంప్రదించవలసిన వారు:
1. శ్రీ కె. మేఘనాధన్, AEO – 9959403234
2. శ్రీ కె. చిట్టిబాబు, సీనియర్ అసిస్టెంట్ – 9959015657

No comments:
Post a Comment